కుమారుడికి ఈత నేర్పిస్తూ అనంతలోకాలకు..కుమారుడికి సరదాగా ఈత నేర్పించాలనుకున్న ఆ తండ్రి ప్రయత్నం.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ అటవీ శాఖ అధికారి మృతి చెందిన హృదయదారక ఘటన దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం:కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన చింతకింది శ్రీనివాస్ (43) మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
గురువారం సాయంత్రం ఆయన తన కుమారుడికి ఈత నేర్పించడం కోసం నరసన్నపల్లి శివారులోని పొందుర్తి స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లారు. కుమారుడికి నేర్పిస్తూనే ఆయన కూడా ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు.
గమనించిన అక్కడి వారు వెంటనే ఆయన్ను బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఈసీజీ తీసిన అనంతరం శ్రీనివాస్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు శ్రీనివాస్ తండ్రి నారాయణ.
కామారెడ్డిలోనే నివాసముంటూ అటవీ శాఖలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ అకాల మరణంతో విద్యానగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
భర్త మరణంతో భార్య స్వప్న, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై మృతుడి భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి (డీవైపీ) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
