HomeCRIMEఇందిరమ్మ ఇళ్ల ముసుగులో.. అక్రమ మొరం దందా!

ఇందిరమ్మ ఇళ్ల ముసుగులో.. అక్రమ మొరం దందా!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముసుగులో మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులో అక్రమ మొరం మాఫియా రెచ్చిపోతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ప్రాంతంలో గుట్టలను గుల్ల చేస్తూ, ప్రకృతి సంపదను నిలువునా దోచేస్తున్నారు. కొందరు స్వార్థపరులు ప్రభుత్వ అనుమతులను అడ్డం పెట్టుకుని ప్రైవేట్ దందాకు తెరలేపినా.. మండల కేంద్రంలోని అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిరుపేదల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం అంటూ అనుమతులు పొందిన కొందరు కేటాయించిన పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ పనులకు సెలవు రోజైన ఆదివారం నాడు కూడా ఇక్కడ జేసీబీలు, లారీలు నిరంతరాయంగా నడుస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాల పేరు చెప్పి, ఆ మొరాన్ని ప్రైవేట్ వ్యక్తులకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు భారీ రేట్లకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటివరకు పచ్చని చెట్లతో దర్శనమిచ్చిన సిర్పూర్ గుట్టలు.. మాఫియా కరడుగట్టిన తవ్వకాలతో ఇప్పుడు బోడిగుట్టలుగా మారుతున్నాయి.

పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సిర్పూర్ శివారు నుంచి పదుల సంఖ్యలో లారీలు మొరం లోడ్‌తో నేరుగా మోపాల్ మండల కేంద్రం గుండానే ప్రధాన రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ‘మామూళ్ల’ మత్తు ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

కాసుల కక్కుర్తితోనే అధికారులు పట్టీపట్టనట్లు ఉంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును, ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఈ అక్రమ మొరం దందాపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిర్పూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments