తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు జాతీయ జెండాను, పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలోని కార్యక్రమాల అనంతరం నాయకులు వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్కుకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. అమరవీరుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దండు నీతుకిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
