హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి రోజా రమణి (26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది . లోన్ యాప్ వేధింపులు తాళలేకే యువతి ఆత్మ హత్య కు పాల్పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా రమణి, మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
గత కొంతకాలంగా ఆమె కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పైనుండి ఆమె దూకినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి.
ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు సేకరించిన సమాచారం మేరకు, యువతి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తీసుకున్న అప్పుల కోసం లోన్ రికవరీ ఏజెంట్లు ఆమెను తీవ్రంగా వేధించినట్లు, ఆ వేధింపులు భరించలేకే ఆమె ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
