అధికారి మానసిక వేధింపులు తట్టుకోలేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లోకలకలం రేపింది. అదిబట్ల సర్కిల్ తుర్కయాంజల్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని శ్రీధర్ బాబు(39), తన భార్య పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు.
కాగా ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖలో అవుట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన తన కూతురు కాలేజీ అడ్మిషన్ కోసం ఉన్నత అధికారి అనుమతితో తన విధుల నుంచి తొందరగా వచ్చాడు.
ఆయన ఇంటికి వచ్చిన కొద్ది సేపటికె అదే శాఖకు చెందిన పై అధికారి లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడిన వెంటనే గదిలోకి వెళ్లి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కొంత సమయం తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడిని గత కొంతకాలంగా పై అధికారి లోన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తూ పదే పదే ఫోన్ చేస్తూ వేధించడం వలన తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య సరోజ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
