మద్యం సేవించి వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతకు విఘాతం కలిగిస్తున్న వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కఠిన చర్యలు చేపట్టింది.
గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 194 మంది వాహనదారులు పట్టుబడ్డారు అని పోలీస్ కమిషనర్ ఒ ప్రకటనలో తెలిపారు.
నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేసి, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా.. న్యాయస్థానం ఆరుగురికి జైలు శిక్షతో పాటు, అందరికీ కలిపి రూ. 11,60,000 జరిమానా విధించింది.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్య గణనీయంగా ఉండటంతో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య హెచ్చరించారు.
