నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో ఇప్పుడిప్పుడే వైద్య సేవలు మెరుగు పడుతున్న వేల ప్రభుత్వం చేపట్టిన బదిలీ పక్రియ ఆసుపత్రి నిర్వహణ కు శరాఘాతం అయ్యేలా ఉంది. ఎడాపెడా సీనియర్ డాక్టర్ లను బదిలీ చేసిన ఉన్నతాధికారులు కొత్త సూపరెండెంట్ నియామకం లో ఎప్పటిలాగే మీనమేషాలు మొదలు పెట్టారు.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు అసలు ఆసుపత్రి వుందనే సోయి కూడా లేకుండా పోయింది. గతంలో అనేక ఆరోణలతో బదిలీ అయి వెళ్లిన ఓ డాక్టరు ను నిజామాబాద్ తేవడానికి అధికార పార్టీ నేత అల్లుడు అడ్డు దారిలో పోస్టింగ్ వేయించాడు. ఈ వ్యవహారంలో పది లక్షల రూపాయలు చేతులు మారాయనేది ఆసుపత్రి వర్గాలు కోడై కూస్తున్నాయి.సరే కాసుల కక్కుర్తి ఎలా ఉన్న .
ఆసుపత్రి కి పూర్తీ స్థాయి సూపరెండెంట్ నియమించే విషయంలో కనీస శ్రద్ద ఎందుకు చూపెట్టలేక పోతున్నారనే చర్చ సర్వత్రా సాగుతుంది. ఆసుపత్రి పాలనపై మంచి పట్టు ఉండి, గత కొంతకాలంగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్న కీలక వైద్యులను ఒకేసారి బదిలీ చేయడం, ఆ స్థానాల్లో తగిన సంఖ్యలో కొత్త వారిని నియమించకపోవడం రోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నాగమోహన్ ఆధ్వర్యంలో జీజీహెచ్ గత కొంతకాలంగా సరికొత్త మార్పులను సంతరించుకుంది.
గుండె సంబంధిత చికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ వంటి అత్యాధునిక వైద్య సేవలను పేదలకు చేరువ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దీనికి తోడు డాక్టర్లు ప్రతిమ, తిరుపతిరావు, శ్రీనివాస్ వంటి సీనియర్ వైద్యుల బృందం తమ అనుభవంతో ఆసుపత్రి అభివృద్ధిలో పాలుపంచుకోవడంతో, ప్రభుత్వ వైద్యంపై సామాన్యుల్లో నమ్మకం పెరిగింది.
అభివృద్ధి దిశగా సాగుతున్న ఆసుపత్రిలో ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే, ఉన్నతాధికారులు సీనియర్ వైద్యులను బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత రెండు రోజులుగా సూపరింటెండెంట్ స్థానం ఖాళీగా ఉండటంతో ఆసుపత్రి పాలన అస్తవ్యస్తంగా మారింది. అత్యవసర చికిత్స కోసం వచ్చే పేద రోగులకు సరైన దిశానిర్దేశం చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జీజీహెచ్ నుంచి ఏకంగా 13 మంది కీలక వైద్యులు బదిలీపై వెళ్ళిపోగా, వారి స్థానంలో కేవలం ఐదుగురు మాత్రమే విధుల్లో చేరారు.
ఇప్పటికే సిబ్బంది కొరతతో వైద్య సేవలు ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో, ఉన్నవారిని కూడా బదిలీ చేసి, తగినంత మందిని కేటాయించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల బృందం వెళ్ళిపోవడంతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు ఆసుపత్రి నిర్వహణను, మెరుగవుతున్న వైద్య సేవలను ఎలా గాడిలో పెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, తక్షణమే పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ను నియమించాలని, అలాగే సరిపడా వైద్యులను కేటాయించి అత్యవసర వైద్య సేవలను పునరుద్ధరించాలని ప్రజలు, రోగులు డిమాండ్ చేస్తున్నారు.
లేనిపక్షంలో, ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతిని, రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
