వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ఒక తల్లి తన ఇద్దరు చిన్నారులతో అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళ్తే.. అమీనాపూర్ గ్రామానికి చెందిన మహిళ, ఈ నెల 25వ తేదీన ఇంట్లో వారితో చెప్పి తన ఇద్దరు పిల్లలతో కలిసి వేల్పూర్‌కు బయలుదేరింది.
ఎనిమిదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి వెళ్లిన ఆమె, ఎంతసేపటికీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతకడంతో పాటు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆందోళనకు గురయ్యారు.
ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో, చివరికి స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లితో పాటు ఇద్దరు చిన్న పిల్లలు కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆ మహిళ, పిల్లల ఆచూకీ కోసం వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
