నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యకు ఉన్న వివాహేతర సంబంధమే ఈ మరణానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
మృతుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మొదట ప్రచారం జరిగినప్పటికీ, మృతదేహం మెడపై గాయాలు ఉండటంతో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఎడపల్లి ఎస్ఐ వివరణ ఇస్తూ.. మంగళవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటమే ఈ గొడవలకు, తద్వారా భర్త ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ పేర్కొన్నారు.
