నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయం బాలికల వసతి గృహంలో నెలకొన్న నీటి సమస్యపై విద్యార్థినులు గురువారం ఆందోళనకు దిగారు.
గత కొన్నిరోజులుగా హాస్టల్‌లో తాగునీరు, వినియోగ నీటి సరఫరా సరిగా లేక కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యను పలుమార్లు విశ్వవిద్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, క్యాంపస్‌లోకి వచ్చిన ఆర్టీసీ బస్సును అడ్డుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం క్యాంపస్ ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వెంటనే హాస్టల్‌లో నీటి సరఫరాను పునరుద్ధరించి, విద్యార్థినుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు విశ్వవిద్యాలయ అధికారులను డిమాండ్ చేశారు. ఆందోళనతో క్యాంపస్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
