నూతన భవన నిర్మాణ పనుల్లో భాగంగా లిఫ్టు పైపులను పైకి పంపిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోర్గం(పి)లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. బోర్గం(పి) గ్రామంలోని సందగిరి భూమారెడ్డికి చెందిన కమర్షియల్ భవన నిర్మాణ పనులను అహ్మద్ మిశ్రా అనే కాంట్రాక్టర్ చేపడుతున్నారు. ఈ భవనంలో లిఫ్టు అమర్చేందుకు గాను కూలీలు పని చేస్తున్నారు.
బుధవారం సాయంత్రం నాందేడ్ జిల్లాకు చెందిన కిరణ్ (30), దీపక్ (20) అనే ఇద్దరు కూలీలు లిఫ్టు పైపులను భవనం పై అంతస్తులోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. పైపులను సిమెంట్ మిశ్రమం ఉన్న పై అంతస్తుకు చేరవేస్తుండగా, అనుకోకుండా అవి పైన ఉన్న 33/11 కెవి విద్యుత్ తీగలకు తగిలాయి.
దీంతో ఒక్కసారిగా భారీ స్థాయిలో విద్యుత్ ప్రసరించడంతో కిరణ్, దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే వారిని నగరంలోని ప్రగతి ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
అయితే, చికిత్స పొందుతూ కిరణ్ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీపక్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
