నిజామాబాద్ డివిజన్ అధికారులతో సిపి సమీక్ష సమావేశం.. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై పోలీస్ కమిషనర్ సాయిచైతన్య గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాబోయే పండుగల దృష్ట్యా నిజామాబాద్ డివిజన్‌లో బందోబస్తును పటిష్టం చేయాలని కమిషనర్ సూచించారు.
24 గంటల పాటు వాహనాల తనిఖీలు చేపట్టాలని, విధుల్లో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. గంజాయి, గుట్కా, పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.మహిళల భద్రత విషయంలో రాజీపడకూడదని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ అధికారులను కోరారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, లింకు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు, పొదల తొలగింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇంజనీరింగ్ లోపాలుంటే నేషనల్, స్టేట్ హైవే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్‌లపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని కమిషనర్ సూచించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని (సీసీ కెమెరాలు) సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఏసీపీలు సీఐలు, ఎస్హెచ్‌ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
