నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మ్యాక్స్ విజన్ హాస్పిటల్ సౌజన్యంతో భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్, ఏసీపీ టి. శ్రీనివాస్ ల మార్గదర్శకత్వంలో జరిగిన ఈ శిబిరం సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది. సిబ్బంది విధులను చురుగ్గా, శారీరక దృఢత్వంతో నిర్వహించేందుకు ముందస్తు ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
వైద్యులు సిబ్బందికి గుండె సంబంధిత పరీక్షలు, అత్యాధునిక కంటి పరీక్షలు, రక్తపోటు (బిపి), రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించారు. పరీక్షలు చేయించుకున్న 60 మంది సిబ్బందికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. అలాగే, వైద్యులు వారికి తగిన ఆరోగ్య సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా అత్తాపూర్ ఎస్‌హెచ్‌ఓ కె. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలీసుల సంక్షేమం కోసం ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
వైద్య శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన డీసీపీ, ఏసీపీలకు మరియు సేవలు అందించిన మ్యాక్స్ విజన్ హాస్పిటల్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
