జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులతో తక్షణమే సమీక్షా సమావేశం నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, వర్షాల లేమి, ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బాన్సువాడ, బోధన్ ప్రాంతాల్లో రైతులు రెండోసారి నాట్లు వేసినా నీటి కొరతతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోతుండగా, సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేక రైతులు పంటలను కాపాడుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి నిర్వహణపై ఇరిగేషన్ శాఖ అధికారులతో ఇప్పటివరకు సమీక్ష జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు.నిజాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న 6.5 టీఎంసీలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఉన్న 15 టీఎంసీల నీటిని ఎప్పుడు, ఎంత మేరకు విడుదల చేస్తారనే అంశంపై రైతులకు స్పష్టత ఇవ్వాలని కోరారు.
పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయిలో అంచనా వేసి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
