నకిలీ పత్రాలు సృష్టించి అమాయక మహిళకు చెందిన ఖాళీ స్థలాన్ని కబ్జా చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల మేరకు.. బాధితురాలు గంగ రాజేశ్వరి నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో భర్తతో కలిసి నివాసం ఉండేది. 2015లో భర్త మృతి చెందడంతో ఆమె బంధువుల వద్ద ఉంటూ వచ్చింది.
ఈ క్రమంలో ఆమెకు చెందిన ఇంటి స్థలాన్ని లక్ష్యంగా చేసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు రూపొందించి అక్రమంగా ఆక్రమించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.
విచారణలో నకిలీ పత్రాల ఆధారంగా స్థలాన్ని ఆక్రమించినట్లు తేలడంతో ఇర్ఫాన్, సలీం, శివకుమార్, పోశెట్టి, శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ సాగిస్తున్నట్లు వెల్లడించారు.
