గతేడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, ఆ బాధ నుంచి తేరుకోకముందే కుమారుడిని మృత్యువు కబళించింది. తండ్రిని పొట్టనబెట్టుకున్న రోడ్డు ప్రమాదమే, కొడుకు ప్రాణాలను సైతం బలితీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నింపింది.
వరుస ప్రమాదాలతో తమ కుటుంబం ఛిన్నాభిన్నమైందని, రోడ్డు ప్రమాదాలు శాపంగా మారాయని ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన తాటి చెట్ల రాములు గతేడాది జరిగిన లారీ ప్రమాదంలో దుర్మరణం చెందారు.
ఆ ఆస్తికర ఘటన నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోకముందే, ఆదివారం మరో విషాదం చోటుచేసుకుంది. రాములు చిన్న కుమారుడు రవి (18), పనుల నిమిత్తం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు వెళ్లాడు.
ఈ క్రమంలో రవి ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మరణం తర్వాత కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కుమారుడు కూడా విధి వక్రించి దూరమవ్వడంతో, ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది.
