ఉద్యోగ బాధ్యతలను దుర్వినియోగం చేసి రూ.1.23 కోట్ల విలువైన కంపెనీ సరుకును అక్రమంగా మళ్లించిన కేసులో నిందితుడికి నాంపల్లిలోని VIII అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అలాగే రూ.10 వేల జరిమానా కూడా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో 2017లో నమోదైన ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 423, 408, 420, 468, 506 కింద నేరం రుజువైనట్లు నిర్ధారించింది.
చాదర్‌ఘాట్ ఎస్‌హెచ్‌వో కె.బి. మురారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ ప్రశాంత్‌నగర్, మూసారాంబాగ్‌కు చెందిన ఎం. వీర వెంకట కృష్ణారావు M/s 3 ఎఫ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థలో 2013 నవంబర్ 5న ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరి, అనంతరం మలక్‌పేట్ డిపో మేనేజర్‌గా పనిచేశాడు.
2016 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 19 వరకు కంపెనీ తమ అకౌంటింగ్ విధానాన్ని ఈఆర్ పీ నుంచి ఎస్ఏపీ సిస్టమ్‌కు మార్చుతున్న సమయంలో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని కంపెనీ అనుమతి లేకుండా నకిలీ మాన్యువల్ బిల్లులు సృష్టించి డిపోలోని సరుకును అక్రమంగా మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది.2016 నవంబర్ 19న కంపెనీ నిర్వహించిన ఆడిట్‌లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. ఎస్ఏపీ రికార్డుల ప్రకారం డిపోలో ఉండాల్సిన 17,720 యూనిట్ల సరుకులో కేవలం 4,810 యూనిట్లు మాత్రమే లభించాయి.
దీంతో 12,910 యూనిట్ల సరుకు గల్లంతైనట్లు గుర్తించారు. దీని విలువ రూ.1,23,21,934గా కంపెనీ నిర్ధారించింది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత నిందితుడు 2017 జనవరి 17, మార్చి 11 తేదీల్లో తన వల్ల కంపెనీకి నష్టం జరిగినట్లు అంగీకరిస్తూ బాండ్లు రాసిచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే నష్టాన్ని భర్తీ చేయకుండా 2017 ఏప్రిల్ 1 నుంచి విధులకు హాజరుకాక పరారయ్యాడని, కంపెనీ అధికారులను బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్రమంగా మళ్లించిన నిధులతో ఆస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు సంస్థ ఆరోపించింది. ఈ ఘటనపై సంస్థ అసిస్టెంట్ మేనేజర్ (కమర్షియల్) ఎస్. మురళీ మోహన్ శివకుమార్ కోర్టు రెఫర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చాదర్‌ఘాట్ పోలీసులు 2017 సెప్టెంబర్ 16న క్రైమ్ నెం.293/2017గా కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా పోలీసులు సమర్పించిన పత్రాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు నేరం రుజువైందని తేల్చి, ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న ఈ మోసం కేసుకు న్యాయపరంగా ముగింపు లభించింది.
