నృత్యాలు, కోలాటాలతో ఆధ్యాత్మిక శోభనిజామాబాద్ నగరంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి పారవశ్యంతో అంగరంగ వైభవంగా జరిగింది. నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చి రథయాత్రలో పాల్గొన్నారు.
దీంతో నగర ప్రధాన వీధులు భక్తజనంతో కిక్కిరిశాయి.రథయాత్ర ప్రారంభ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జెండా ఊపి శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కంటేశ్వర్ ప్రాంతం నుంచి ప్రారంభమైన రథయాత్ర నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్ల మీదుగా వైభవంగా సాగింది. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలను ఊరేగించగా, భక్తులు “హరే కృష్ణ.. హరే రామ” నామసంకీర్తనలు చేస్తూ రథాన్ని లాగారు.
రథయాత్రలో సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు, భజన బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు, యువత, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు. మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు ప్రసాదం, తాగునీరు పంపిణీ చేశారు.
రథయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. భక్తుల విశేష స్పందనతో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర నిజామాబాద్‌లో కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
