ర్రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ తెలిపారు.
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం ఆలయంలో నిర్వహించిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం సీపీ మాట్లాడుతూ.. లాల్‌దర్వాజా బోనాలకు 120 ఏళ్లకు పైగా చరిత్ర ఉందన్నారు.
గోల్కొండ, బల్కంపేట బోనాలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో లాల్‌దర్వాజా ఉత్సవాలను కూడా అదే తరహాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్, ఆర్అండ్బీ తదితర శాఖలతో సమీక్షలు నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఉత్సవాల సందర్భంగా ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్, జేబుదొంగతనాలు వంటి ఘటనలు జరగకుండా క్రైమ్ విభాగం, షీ టీమ్స్‌ను 24 గంటలూ అప్రమత్తంగా ఉంచినట్లు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
బోనాల ఉత్సవాలు విజయవంతం కావడానికి భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు సీపీ తఫ్షిర్ ఇక్బాల్, డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
