తెలంగాణ రాష్ట్రంలో బేడ బుడగ జంగం సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని కేటాయించాలని నిజామాబాద్ జిల్లా బేడ బుడగ జంగం జనసంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జిల్లా అధ్యక్షుడు డొక్కా రంజిత్ ఈ డిమాండ్‌ను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డొక్కా రంజిత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బేడ బుడగ జంగం కులస్తుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం శ్రీ సిరిపాటి వేణు అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల సమస్యపై సమాజానికి అవగాహన కల్పించడంలోనూ, ప్రతి మండలంలోనూ నిజమైన అర్హులకు సరైన కుల ధ్రువీకరణ పత్రాలు అందేలా చేయడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో బేడ బుడగ జంగం వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. హైదరాబాద్‌లో బేడ బుడగ జంగం ఆత్మగౌరవ భవన నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అన్ని రంగాల్లో సమాజానికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చిస్తూ, అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఆయన నాయకత్వ ప్రతిభ ప్రశంసనీయమని జిల్లా కమిటీ అభిప్రాయపడింది.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు వానరాసి సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్ప సంగయ్య, ఉపాధ్యక్షులు సదుల రాజేశ్వర్, సంకు సాయిలు, డొక్క బాబు, చిత్తారి రాములు, కోఆర్డినేటర్ సదుల వీరేశం, ఊబిది మహేష్ తదితరులు పాల్గొన్నారు.
