ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అంకితభావంతో విధులు నిర్వహించిన టౌన్ 6 పోలీసు సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏఎస్‌ఐ డి. జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి. సాయిబాబాలను శాలువాలతో సత్కరించి ప్రశంసించారు. భారీ వర్షాలకు టౌన్–6 పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ రెహమాన్ హోటల్ నుంచి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు బోధన్ ప్రధాన రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఎస్సై సందీప్ ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త కారణంగా నీటి ప్రవాహం నిలిచిపోవడంతో సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ రహదారులపై నిలిచిన నీరు త్వరగా తొలగేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు.
ప్రజాసేవే పోలీసు శాఖ ప్రధాన ధ్యేయమని, ఇదే సేవాస్ఫూర్తితో భవిష్యత్తులోనూ విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్–6 ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.
