హైదరాబాద్ మహానగరం అసలైన పండగ శోభ తో మురిసి పోయింది. లష్కర్ బోనాలు చివరి అంకానికి చేరాయి ఆషాఢమాసం చివరి ఆదివారం రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు భక్తులు లక్షలాది తరలి వచ్చారు ఆయా ప్రాంతాల్లోదేవాలయాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరుపున పట్టు వస్ర్తాలు బోనాలు సమర్పించారు.నగరంలో ఎటు వైపు చూసిన బోనాల సందడి కనిపించింది .
నగరంలోని ఆయా ప్రాంతాల్లో కొలువైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, భవాని, మహాంకాళి తదితర అమ్మవార్ల ఆలయాలకు బోనం సమర్పించేందుకు భక్తులు తెల్లవారు జామున నుంచే పోటెత్తారు. మహిళలు వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలు నెత్తినపెట్టుకుని అమ్మవార్ల ఆలయాలకు బయలెల్లారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి బెల్లం సాకపోసి బోనం నైవేద్యంతోపాటు గాజులు, చీరెసారె సమర్పించి తల్లి చల్లంగ చూడమని వేడుకుంటున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువుల చప్పుళ్లతో సందడి చేశారు . లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారకి ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించగా, అక్కన్న మాదనన్న మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీధర్ బాబు, అంబర్పేట అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం తరఫున మంత్రి సీతక్క పట్టువస్త్రాలు సమర్పించారు.
మాదన్నపేట నల్లపోచమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు.అట్టహాసంగా లాల్ దర్వాజా బోనాలు:లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రోహ్మోత్సవాలు కావడంతో అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామునుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలకంరణ చేపట్టారు.
దేవాలయం తరఫున అమ్మవారికి తొలిబోనం సమర్పించగా రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడి బియ్యం, చీర, సారే సమర్పణ జరగనుంది.ఇక్కడికి రాత్రి పది గంటల దాక అయిదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం వుందని నిర్వాహుకులు చెప్తున్నారు ముందు జాగ్రత గా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు ఆయా ఆలయాల వెళ్లే మెయిన్ రోడ్ లను బ్లాక్ చేసి ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నారు
///// భాగ్యనగర్ అమ్మవారికి ప్రముఖుల తాకిడి /////
అమ్మవారి ని దర్శించుకోవడానికి ప్రముఖులు సైతం క్యూ కట్టారు.మంత్రులు సినీప్రముఖులు రాజకీయ పార్టీ ల ప్రముఖులు సైతం ఆదివారం అమ్మవార్లను దర్శించుకున్నారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారిని సినిమా నటుడు విజయ్ దేవరకొండ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లు దర్శించుకున్నారు.
బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చిన విజయ్ దేవరకొండ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయ్ దేవరకొండ రాకతో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆయన అభిమానులు సందడి చేసారు
