సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా ముందంజలో పయనిస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి.
ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా బోధన్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన మీదట, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు.వానాకాలం 2026లో ఇప్పటి వరకు 3.87 లక్షల ఎకరాల్లో వరి, 52 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో సోయా, 900 ఎకరాల్లో కంది సాగైంది. యూరియా 42,983, డీఏపీ 11,554, పొటాష్ 1,913, కాంప్లెక్స్ 38,067 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు.
రైతు బీమా కింద 786 మంది రైతుల నామినీలకు రూ.39.30 కోట్లు జమ చేశారు. రైతు భరోసా కింద 2.75 లక్షల మంది రైతులకు రూ.316.21 కోట్లు అందించారు. జిల్లాలో 4,77,780 ఆహార భద్రత కార్డుల ద్వారా 16,09,447 మంది లబ్ధి పొందుతున్నారు. మహాలక్ష్మి పథకంలో 2,47,603 మందికి 14,87,826 సిలిండర్లపై రూ.46.86 కోట్ల సబ్సిడీ అందించారు. 2025-26 రబీలో 669 కేంద్రాల ద్వారా 7,42,305 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.1,772.14 కోట్లు చెల్లించారు.
సన్నధాన్యం బోనస్ కింద 97,041 మంది రైతులకు రూ.299.71 కోట్లు అందించారు. 16,924 ఇందిరమ్మ ఇళ్లుజిల్లాలో మొదటి దశలో 16,924 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 9,624 పూర్తయ్యాయి. 7,300 పురోగతిలో ఉన్నాయి. ఇందుకోసం రూ.438.30 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు కేటాయించారు.మహిళలకు ఉచిత ప్రయాణంమహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలు ఇప్పటి వరకు 9.86 కోట్ల ప్రయాణాలను ఉచితంగా సద్వినియోగం చేసుకున్నారు.
దీంతో వారికి దాదాపు రూ.421.51 కోట్లు ఆదా అయ్యాయి. గృహజ్యోతి కింద 2,72,300 కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేసి రూ.296.25 కోట్ల సబ్సిడీ అందించారు.జిల్లాలో 2,63,487 మంది పెన్షన్‌దారులకు నెలకు రూ.56.73 కోట్లు పంపిణీ చేస్తున్నారు. 2025-26లో స్త్రీనిధి ద్వారా రూ.242.63 కోట్ల రుణాలు మంజూరు చేసి రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
46 విద్యుత్ ఆటోలకు రూ.13.08 కోట్లు, 26 ఎలక్ట్రిక్ స్కూటీలకు రూ.26 లక్షలు రుణాలు ఇచ్చారు. వడ్డీ రాయితీ కింద 19,291 సంఘాలకు రూ.44.23 కోట్లు విడుదల చేశారు. ఉపాధి హామీ కార్యక్రమంలో 96,744 కుటుంబాల్లోని 1,32,102 మంది కూలీలకు 29.07 లక్షల పనిదినాలు కల్పించి రూ.86.19 కోట్లు ఖర్చు చేశారు. ఆయిల్‌పామ్ సాగుకు 1,600 ఎకరాల లక్ష్యానికి గాను 1,526 ఎకరాలకు 564 మంది రైతులను ఎంపిక చేసి, 166 ఎకరాల్లో మొక్కలు నాటారు.
బిందు, తుంపర సేద్యం కింద 4,691 ఎకరాల్లో పరికరాలు అమర్చారు. పండ్లతోటలు, కూరగాయల సాగుకు 901 మంది రైతులకు రూ.94 లక్షల రాయితీ ఇచ్చారు. జిల్లాలో 405 మత్స్య సహకార సంఘాల్లో 24,663 మంది సభ్యులు ఉన్నారు. 967 చెరువుల్లో 4.54 కోట్ల చేపపిల్లలను వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 36 కొత్త చేపల చెరువు యూనిట్లు మంజూరు చేశారు.
ప్రమాద బీమా కింద 114 మంది నామినీలకు రూ.5.60 కోట్లు అందించారు. 1,159 పాఠశాలల్లో 97,720 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఎస్ఎస్సీలో 24,365 మందికి పరీక్షలు నిర్వహించగా 22,961 మంది ఉత్తీర్ణులై 94.24 శాతం ఫలితాలు సాధించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలకు రూ.42.23 కోట్లు మంజూరు చేసి రూ.24.27 కోట్లు విడుదల చేశారు.
జిల్లాకు రూ.800 కోట్లతో మల్కాపూర్, పోతంగల్, బెల్లాల్, అంకాపూర్‌లలో నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయి. జాతీయ ఆరోగ్య మిషన్ కింద రూ.27.28 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌లో 134 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 1,49,308 మంది రోగుల నుంచి 2,96,774 నమూనాలు సేకరించి 5,98,708 పరీక్షలు చేశారు.
ఆరోగ్యశ్రీ కింద జనవరి నుంచి జూలై వరకు మొత్తం 16,055 మంది లబ్ధి పొందారు.అంగన్వాడీల ద్వారా 97,099 మంది పిల్లలు, 9,636 మంది గర్భిణులు, 6,277 మంది బాలింతలకు పోషకాహార సేవలు అందిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్-12లో 119 మంది బాలురను రక్షించారు. ఎస్సీ వసతి గృహాల్లో 15,681 మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం రూ.3.86 కోట్లు ఖర్చు చేశారు.
36 కులాంతర వివాహ జంటలకు రూ.75 లక్షల ప్రోత్సాహకం అందించారు. గిరిజన వసతి గృహాల్లో 1,505 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఉపకార వేతనాల కింద రూ.9.15 కోట్లు ఖర్చు చేశారు. బీసీ విద్యార్థుల కోసం 34 వసతి గృహాల్లో 3,254 మందికి వసతి కల్పిస్తున్నారు.
పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేశారు. మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మహిళా యోజన ద్వారా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం, అర్హులకు ఇ-మోపెడ్లు అందిస్తున్నారు.హ్యామ్ రోడ్స్ పథకం కింద 256.63 కిలోమీటర్ల మేర 17 పనులకు రూ.389.94 కోట్లు మంజూరు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ పథకాల కింద 2,846 పనులకు రూ.809.95 కోట్లు మంజూరు కాగా 794 పనులు పూర్తయ్యాయి.
కల్యాణలక్ష్మి కింద 875 మందికి రూ.8.76 కోట్లు, షాదీముబారక్ ద్వారా 371 మందికి రూ.3.71 కోట్లు అందించారు. భూభారతిలో 72,311 దరఖాస్తులు రాగా 70,384 పరిష్కరించారు. 70 గ్రామాలను రీ-సర్వేకు ఎంపిక చేసి 22 గ్రామాల్లో అవగాహన సభలు, 18 గ్రామాల్లో రీ-సర్వే పనులు చేపట్టారు.
*ఫ్రెండ్లీ పోలీసింగ్*
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళల రక్షణకు షీటీంలు సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.పంద్రాగస్టు వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి.
ఎదనిండా దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. కంజర రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, విశ్వ వికాస్ హైస్కూల్, నవీపేట్ బాలికల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు, టైం స్కూల్ చిన్నారులు సాంస్కృతిక గేయాలపై చక్కటి అభినయం ప్రదర్శించారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ట్రైనీ కలెక్టర్ సురేష్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
