నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ఆధ్వర్యంలో ఈనెల 30న నిర్వహించనున్న నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.
పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది.నగరంలో మున్నూరు కాపు సంఘం, అర్సపల్లిలోని ఎ.వి. ఎంటర్‌ప్రైజెస్, మల్లారంలోని ఆయేషా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని షిఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు.
పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఈనెల 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుమిగూడడం నిషేధించారు.
ఈ సమయంలో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ కేంద్రాలు, స్టేషనరీ దుకాణాలను మూసివేయాలని నిర్వాహకులకు సూచించారు.ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని, అందరూ విజయం సాధించాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షిస్తూ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
