అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి రాఖీలు కట్టి, వారి ఆయురారోగ్యాలను ఆకాంక్షించారు.
పలుచోట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య రాఖీ వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. పండుగ సందర్భంగా ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పుట్టింటికి తరలివెళ్లడంతో నిజామాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రాఖీ సందర్భంగా అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు.
అన్నదమ్ములు తమ సోదరీమణులకు కానుకలు అందజేసి ఆత్మీయతను చాటుకున్నారు. పండుగను అన్నదమ్ములతో కలిసి జరుపుకునేందుకు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మహిళలు స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో బస్టాండ్లు, రహదారులు ప్రయాణికులతో సందడిగా మారాయి.
చేతుల్లో రాఖీలు, స్వీట్లు, పండుగ సామగ్రితో మహిళలు కనిపించారు.రాఖీ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న చిన్నారులు, మహిళలతో బస్సుల్లో కిలకిలారావాలు వినిపించాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నిజామాబాద్ బస్టాండ్ ఉదయం నుంచే కిక్కిరిసిపోయింది. రాఖీ పండుగ సందర్భంగా నగరంలో ఎటుచూసినా పండుగ సందడి కనిపించింది.
