టెండర్ పేరుతో మరో 20 రోజులునిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాలకు కనీస భద్రత కరవైంది. పది మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న మూడు ఫ్రీజర్లు ఉన్నా.. ఒక్కటీ పనిచేయడం లేదు. దీంతో శవాలను బయట టేబుళ్లపైనే ఉంచుతున్నారు.
గుర్తుతెలియని మృతదేహాలు రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉండాల్సి రావడంతో కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. మృతుల బంధువులు ముక్కులు మూసుకుని ఉండాల్సి వస్తోంది.
సమస్యపై పలుమార్లు నివేదికలు పంపినా.. టెండర్ పేరుతో మరో 20 రోజులు పడుతుందని అధికారులు చెబుతుండటం గమనార్హం.ఇంతటి దుస్థితి నెలకొన్నా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మొత్తం మూడు ఫ్రీజర్లు ఉన్నాయి. వీటిలో రెండు ఫ్రీజర్లలో మూడు చొప్పున బాక్సులు, మరో ఫ్రీజర్లో నాలుగు బాక్సులు ఉన్నాయి. మొత్తంగా 10 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉంది.
అయితే నిర్వహణ, మరమ్మతుల లోపంతో ప్రస్తుతం ఒక్క ఫ్రీజర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అత్యవసరంగా వచ్చే మృతదేహాలను బయట టేబుళ్లపై ఉంచాల్సి వస్తోంది. ప్రమాదాలు, ఇతర ఘటనల్లో గుర్తుతెలియని మృతదేహాలు లభించినప్పుడు వాటిని గుర్తించేందుకు రెండు, మూడు రోజులపాటు మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది.
ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వాటిని బయట ఉంచాల్సి వస్తోంది. వాతావరణంలోని మార్పులు వల్ల మృతదేహాలు త్వరగా కుళ్లిపోతుండటంతో మార్చురీ పరిసరాలు దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. కుళ్లిన మృతదేహాల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
ఆత్మీయులను కోల్పోయి మార్చురీకి వచ్చే బంధువులకు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. కూర్చునేందుకు సరైన వసతి లేకపోవడంతోపాటు ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో వెలువడుతున్న దుర్వాసనను భరించలేక ముక్కులు మూసుకుని నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఇది మరింత వేదనగా మారుతోంది.
ఫ్రీజర్లు పనిచేయడం లేదని అధికారులు గతంలోనే ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపినట్లు సమాచారం. కొత్త ఫ్రీజర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ టెండర్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.
టెండర్ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు మృతదేహాలను ఎలా భద్రపరచాలన్నదే ప్రశ్నగా మారింది.ఇంత జరుగుతున్నా.. పట్టించుకునేదెవరు?ప్రభుత్వాస్పత్రి మార్చురీలో మృతదేహాలను భద్రపరిచే కనీస సదుపాయం పనిచేయకపోవడం కొత్త సమస్యేమీ కాదని తెలుస్తోంది.
ఫ్రీజర్ల మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు చేయాల్సిన అవసరంపై గతంలోనే ప్రభుత్వానికి నివేదికలు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. ఇంతటి దుస్థితి కళ్లెదుటే కనిపిస్తున్నా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
