మీ సేవ కేంద్రం ముసుగులో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాల తయారీకి పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని ‘సహారా మీ సేవ కేంద్రం’లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారన్న సమాచారంతో నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో సీసీఎస్, బోధన్ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్, కేంద్రం యజమాని మహమ్మద్ ముక్రమ్ ను అదుపులోకి తీసుకున్నారు.శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వసీమ్ గత రెండేళ్లుగా ముక్రమ్, మరికొందరితో కలిసి నకిలీ మీ సేవ ధ్రువపత్రాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
కేంద్రంతో పాటు తన ఇంటి వద్ద కంప్యూటర్, కలర్ ప్రింటర్ సాయంతో సర్టిఫికెట్లు తయారు చేసి, వాటిపై సంబంధిత రబ్బర్ స్టాంపులు వేసి అసలైనవిగా నమ్మిస్తూ విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసి నిందితులు పంచుకునేవారని తెలిపారు. తనిఖీల్లో ఇప్పటికే తయారు చేసి ఇచ్చిన 22 నకిలీ మీ సేవ జనన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, మరో 5 తయారైన నకిలీ సర్టిఫికెట్లు లభించాయి.
అలాగే తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 38 ఖాళీ ఒరిజినల్ మీ సేవ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 నకిలీ టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు, షాదీ ముబారక్‌కు సంబంధించిన నకిలీ జిరాక్స్ కాపీని, నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన హెచ్‌పీ ల్యాప్‌టాప్, క్యానన్ కలర్ ప్రింటర్, ఇద్దరు నిందితుల సెల్ఫోన్లు సహా మొత్తం సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నకిలీ ధ్రువపత్రాలను కొందరు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు మోసపూరితంగా ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది. బోధన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ వి. వెంకట నారాయణ, ఎస్ఐ ఎల్. రామ్ దర్యాప్తు చేస్తున్నారు.
సీసీఎస్ సీఐ అజయ్, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుళ్లు అనిల్, గంగాప్రసాద్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, టౌన్ పోలీస్ సిబ్బంది గంగారం, శివకృష్ణ ఇతర సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
