దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని పలువురు పేర్కొన్నారు. ప్రముఖ ఇంజినీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ మున్సిపల్ ఇంజినీర్లు, లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని ఇంజినీరింగ్ రంగానికి విశ్వేశ్వరయ్య చేసిన సేవలను స్మరించుకున్నారు.
మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక ప్రగతిలో ఇంజినీర్ల సేవలు అనన్యసామాన్యమని పేర్కొన్నారు. యువ ఇంజినీర్లు విశ్వేశ్వరయ్య ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బంటు రాంకుమార్, సీహెచ్ రఘు, ఆనంద్‌రావు, ఏ. నరహరి, నందకుమార్, శ్రీమన్నారాయణ, శ్రీధర్, నాగరాజు, హజారే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
