నగరంలో దుకాణాలు, వ్యాపార సంస్థల నుంచి మున్సిపల్ ఖాతాలోకి రావాల్సిన ఆదాయంపై పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు షాపుల ముందు బ్యాక్‌లైట్, ఫ్లెక్సీ ప్రకటన బోర్డులు వరుసగా వెలుస్తున్నా.. వాటికి సంబంధించిన రుసుము వసూళ్లపై అధికారులు దృష్టి సారించడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
మరోవైపు చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి వసూలు చేయాల్సిన యూజర్ ఛార్జీల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. ఇక కొందరు సిబ్బంది రసీదులు ఇవ్వకుండానే నగదు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడం వ్యవహారంపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
నిబంధనల ప్రకారం ఒక్కో దుకాణం నుంచి ఏటా సుమారు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాల్సి ఉంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం ఈ రుసుమును మున్సిపల్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
నగరంలో వేల సంఖ్యలో దుకాణాలు ఉండగా.. ప్రతి దుకాణం నుంచి నిర్ణీత మొత్తంలో వసూలు చేస్తే మున్సిపల్‌కు గణనీయమైన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే వాస్తవంగా ఎంత వసూలవుతోంది? ఎంత బకాయి ఉంది? అన్న వివరాలు స్పష్టంగా లేకపోవడం విమర్శలకు కారణమవుతోంది.
బోర్డులు ఎన్నో.. రుసుము వసూలు శూన్యమా?ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాల్లో దుకాణాల ముందు బ్యాక్‌లైట్, ఫ్లెక్సీ, ఇతర ప్రకటన బోర్డులు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వీటికి మున్సిపల్ ప్రకటన రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
కానీ ఇప్పటివరకు ఒక్కో బోర్డుకు సంబంధించిన రుసుము వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. బోర్డులు కనిపిస్తున్నాయి.. మున్సిపల్ ఆదాయం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యూజర్ ఛార్జీల పేరుతో దుకాణదారుల నుంచి కొందరు సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు నగదు తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
చెల్లించిన మొత్తానికి మున్సిపల్ రసీదు ఇవ్వడం లేదని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఆ నగదు మున్సిపల్ ఖాతాలో జమ అవుతోందా లేక మధ్యలోనే మాయమవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల తనిఖీలు ఏవి?ప్రతి దుకాణం నుంచి వసూలు చేయాల్సిన యూజర్ ఛార్జీలు, ప్రకటన బోర్డుల రుసుములు, వసూలైన మొత్తం, మున్సిపల్ ఖాతాలో జమ చేసిన మొత్తం.. వీటన్నింటిపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
రసీదు లేకుండా నగదు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్‌కు రావాల్సిన ఆదాయాన్ని రాబట్టడంలో నిర్లక్ష్యమా.. లేక వసూళ్లపై పర్యవేక్షణ లోపమా అన్నది తేల్చాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే.
