HomeCRIMEమావోయిస్టు సీనియర్‌ డీసీఎం నక్కా సుశీల రాణి లొంగుబాటు..34 ఏళ్ల అండర్‌గ్రౌండ్‌ జీవితానికి ముగింపు..మీడియాకు వివరాలు...

మావోయిస్టు సీనియర్‌ డీసీఎం నక్కా సుశీల రాణి లొంగుబాటు..34 ఏళ్ల అండర్‌గ్రౌండ్‌ జీవితానికి ముగింపు..మీడియాకు వివరాలు వెల్లడించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య..

మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన సీనియర్‌ డీసీఎం నక్కా సుశీల రాణి అలియాస్‌ లత, లలిత, రేలా, జ్యోతి, మాధవి, శ్వేత మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్‌ డీవీసీలో డివిజన్‌ కమిటీ సభ్యురాలిగా, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేసిన ఆమె.. 1992లో ప్రారంభమైన తన మావోయిస్టు ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆమె లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బ అని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన నక్కా సుశీల హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులై 1992 ఫిబ్రవరిలో అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత హైదరాబాద్‌ సిటీ కమిటీ సాంకేతిక విభాగంలో సెంట్రల్‌ ఆర్గనైజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ దళాలు, కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో ఏసీఎంగా, 2002లో డీసీఎంగా పదోన్నతి పొందారు.


ఆంధ్ర–ఒడిశా సరిహద్దు కమిటీ, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్‌ తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 2009లో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కమిటీలో సభ్యురాలయ్యారు. 2011లో బేసిక్‌ కమ్యూనిస్ట్‌ ట్రైనింగ్‌ స్కూల్‌కు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2012 నుంచి 2014 వరకు పీఎల్‌జీఏ బెటాలియన్‌-2లో కేడర్‌కు రాజకీయ శిక్షణ అందించారు. 2014 నుంచి 2025 జనవరి వరకు మాడ్‌ డీవీసీలో కొనసాగుతూ పలు డీవీసీల్లో కేడర్‌కు రాజకీయ శిక్షణ ఇచ్చారు.


.5 లక్షల రివార్డు.. రూ.25 వేల సాయం
ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం కింద సుశీలకు ఉన్న రూ.5 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు రూపంలో అందిస్తున్నట్లు సీపీ తెలిపారు. తక్షణ ఆర్థిక సహాయంగా రూ.25 వేలు అందించనున్నట్లు వెల్లడించారు. పునరావాస విధానం కింద లభించే ఇతర ప్రయోజనాలతో పాటు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు కూడా కల్పించనున్నట్లు చెప్పారు.


ఈ ఏడాది 266 మంది లొంగుబాటు
తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోలీసులు చేపడుతున్న చర్యలతో పాటు లొంగుబాట్లు కూడా పెరుగుతున్నాయని సాయిచైతన్య వివరించారు. 2026లో ఇప్పటివరకు 266 మంది మావోయిస్టు కేడర్‌ లొంగిపోయారు. వీరిలో ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, 12 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 25 మంది డీవీసీఎస్‌/డీవీసీఎంలు, 94 మంది ఏసీఎస్‌/ఏసీఎంలు, 131 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. 2024 నుంచి 2026 వరకు మొత్తం 824 మంది లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.


334 ఆయుధాలు స్వాధీనం
లొంగుబాట్లతో పాటు మావోయిస్టుల నుంచి ఆయుధాల స్వాధీనం కూడా పెరిగింది. 2024లో 36, 2025లో 60, 2026లో ఇప్పటివరకు 238 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్లలో మొత్తం 334 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


తెలంగాణలో అజ్ఞాతంలో ముగ్గురే!
తెలంగాణకు చెందిన మావోయిస్టు కేడర్‌లో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండి పార్టీ వివిధ నిర్మాణాల్లో పనిచేస్తున్నవారిగా ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, జడె రత్నబాయి అలియాస్‌ సుజాత, వార్ష శేఖర్‌ అలియాస్‌ మంగీ మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన మావోయిస్టు కేడర్‌ జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సాయిచైతన్య విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments