మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దానిని సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
శనివారం నగరంలోని ఐటీ టవర్స్‌లో ఎన్‌ఎన్ ఏఐ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఎన్‌ఎన్ హ్యాకథాన్–2026.. కోడ్ ఫర్ చేంజ్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, యువత, టెక్నాలజీ నిపుణులతో సీపీ మాట్లాడారు.
వారు రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రాజెక్టులు, వినూత్న ఆలోచనలు, సమస్యలకు పరిష్కారాలను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐతోపాటు ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపేలా సాంకేతికతను వినియోగించుకోవచ్చన్నారు.
యువతలోని సృజనాత్మకత, ఆలోచనా శక్తి, సాంకేతిక నైపుణ్యాలను సరైన దిశలో వినియోగిస్తే సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ‘కోడ్ ఫర్ చేంజ్’ వంటి కార్యక్రమాలు యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు ప్రజలకు ఉపయోగపడే వినూత్న పరిష్కారాలను రూపొందించేందుకు దోహదపడతాయన్నారు.
ప్రజా భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, డేటా విశ్లేషణ, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖ వినియోగిస్తోందని సీపీ తెలిపారు. యువత టెక్నాలజీని కేవలం ఉద్యోగ, వ్యక్తిగత ప్రయోజనాలకే పరిమితం చేయకుండా ప్రజా ప్రయోజనం, దేశాభివృద్ధికి ఉపయోగపడేలా ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
రోడ్డు భద్రతపై యువత అప్రమత్తంగా ఉండాలియువత రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీపీ సూచించారు. 2025లో నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 327 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కోవిడ్ సమయంలో సైతం రోడ్డు ప్రమాదాల్లో సుమారు 200 మంది మృతి చెందిన విషయాన్ని గుర్తుచేశారు. సైబర్ నేరాల పట్ల యువత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
అనంతరం హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు, యువతను సీపీ ప్రశంసా పత్రాలతో అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎన్ ఏఐ సొల్యూషన్స్ సీఈఓ నజీబ్, మేనేజర్ షేక్ సబ్బార్, కాకతీయ ప్రిన్సిపాల్ రజనీకాంత్, నిర్వాహకులు, టెక్నాలజీ నిపుణులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
