మోర్తాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో నిలిచిపోయిన సిజేరియన్, సాధారణ ప్రసవాలను తక్షణమే పునరుద్ధరించాలని మోర్తాడ్ ఎన్జీవోలు కోరాయి. ఈ మేరకు సోమవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు మాట్లాడుతూ.. గతంలో మోర్తాడ్ ఆసుపత్రికి సిరికొండ, భీమ్‌గల్, వేల్పూర్, కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలాల ప్రజలు వచ్చి ప్రసవాలు జపించుకున్నారని తెలిపారు. అయితే ఆపరేషన్ థియేటర్లో ఏసీ లేకపోవడం, స్లాబ్ సెల్లింగ్ కలర్ లేకపోవడంతో డెలివరీలు నిలిచిపోయాయని ఆసుపత్రి సిబ్బంది చెప్పారన్నారు.
దీంతో స్పందించిన మోర్తాడ్ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ప్రతినిధులు తమ సొంత ఖర్చులతో ఆపరేషన్ థియేటర్‌కు రూ.30,000 విలువైన బీపీఎల్ ఏసీ, ఏషియన్ వైట్ పెయింట్ వేయించామని, అలాగే ఇన్వెర్టర్ బ్యాటరీలు రిపేర్ చేయించి, రూ.50,000 విలువైన ఎలక్ట్రిషన్ సామాగ్రిని విరాళంగా అందించామని వెల్లడించారు.
ఆసుపత్రి భవనంపై చెట్ధా చెత్తా పేరుకుపోయి లీకేజీ అవుతుంటే స్వచ్ఛందంగా శుభ్రం చేయించామని తెలిపారు.అయినా సరే ఆసుపత్రిలో ఇంకా బ్రెయిన్ సర్క్యూట్-2, సీపీఆర్ (అంబు బ్యాగ్) రెస్పిరేటరీ బ్యాగ్, సిలికాన్ ఫేస్ మాస్క్, స్పాన్నర్, డబుల్ గేజ్ రెగ్యులేటర్ కన్వెంటర్ పైప్, వెంటిలేటర్ ట్యూబింగ్ కిట్, ఆక్సిజన్ మాస్క్, ఓటీ టేబుల్ షీట్, ఆటోక్లేవ్, ఫ్యుమిగేటర్, కాటరీ, మేయోస్ ట్రాలీ, ఫీటల్ డాప్లర్, ప్లాస్టిక్ ట్రే ఫర్ న్యూ బోర్న్స్, స్టెరిలైజేషన్ మెషిన్, జెల్ (అల్ట్రాసౌండ్/డాప్లర్) వంటి అనేక ముఖ్యమైన పరికరాలు లేవని తేలిందన్నారు. వీటితో పాటు సీటీ స్కాన్ మిషన్ ఏర్పాటు చేయాలని, అల్ట్రాసౌండ్ రిపేర్ చేయించాలని, స్ట్రెచర్-1, వీల్చైర్లు-3, ఇన్వెర్టర్ బాక్స్‌లు-3 అందజేయాలని కోరారు.
మోర్తాడ్ ఆసుపత్రి సేవలను నమ్ముకుని చుట్టుపక్కల మండలాల నుంచి సుమారు 60,000 మంది ప్రజలు ఉన్నారని, నిరుపేద కుటుంబాలకు వైద్యం అందేలా ఆసుపత్రిని అన్ని విధాలా బలోపేతం చేయాలని వారు కలెక్టర్‌ను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో కే. అనంత్ రావు (మోర్తాడ్ ఎన్జీవోస్)తో పాటు వై. రాజేశ్వర్ రెడ్డి, వి. శ్రీనివాస్, వి. రమేష్, కే. సందీప్ కుమార్, కే. ప్రదీప్, బీ. గంగారం, బీ. సుదర్శన్, డి. మురళి, టి. దీపక్, డి. గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
