HomePOLITICAL NEWSUncategorizedదుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు..మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల ఆంక్షలు..మండపాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. ఉత్సవ మండపాల ఏర్పాటు నుంచి విగ్రహాల నిమజ్జనం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, వాటిని పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. లౌడ్‌స్పీకర్లకు సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, రాత్రి 10 గంటలలోపు వాటిని నిలిపివేయాలని ఆదేశించారు.

ఈ మేరకు సోమవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.నవరాత్రి మండపాలను ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు.

విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవడంతోపాటు మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైరింగ్‌, సురక్షిత లైటింగ్‌ ఏర్పాటు చేయాలి. వర్షం నుంచి రక్షణకు షెడ్లు, ప్లాస్టిక్‌ కవర్లు ఉపయోగించాలి. విగ్రహాలు ఏర్పాటు చేసే వేదిక పటిష్ఠంగా ఉండేలా చూడాలి.

భక్తుల రాకపోకలకు క్యూ పద్ధతి అమలు చేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేయాలి.ప్రతి మండపం వద్ద ఉదయం, రాత్రి వేళల్లో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలి. పోలీసుల తనిఖీల సమయంలో సహకరించడంతోపాటు పాయింట్‌ పుస్తకాన్ని నిర్వహించాలి.

మహిళలు, యువతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, టపాసులు కాల్చడం నిషేధం. యువకులు సంయమనం పాటిస్తూ వివాదాలకు దూరంగా ఉండాలి. భక్తులకు అసౌకర్యం కలగకుండా వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించాలి.

నిమజ్జనంలో అప్రమత్తత అవసరంవిగ్రహాల నిమజ్జనం జరిగే తేదీ, మార్గం, ఇతర వివరాలను ముందుగానే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలి. నిమజ్జన రథాలకు లైటింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్‌ తీగలు, రహదారులపై ఉన్న అడ్డంకులను ముందుగానే పరిశీలించాలి.

చెరువులు, బావులు, కాలువల్లో నిమజ్జనం చేసే సమయంలో ఈత వచ్చిన పెద్దవారు మాత్రమే నీటిలోకి వెళ్లాలి. లోతు తెలియని నీటి గుంతల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారులను నీటి ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. నిమజ్జనం సమయంలో విన్యాసాలు, సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడరాదు.మండపాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు నీటి బకెట్లు, ఇసుక, ఫైర్‌ బాల్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి.

అనుమానాస్పద వ్యక్తులు, గుర్తుతెలియని బ్యాగులు లేదా ప్లాస్టిక్‌ సంచులు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పుకార్లను నమ్మవద్దని, రద్దీ ప్రాంతాల్లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 112కు లేదా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126-59700 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా నిరంతర పోలీసు నిఘా ఉంటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments