HomeCRIMEసుధాకర్‌ మృతితో నిజామాబాద్‌లో హైటెన్షన్‌..భీమ్‌గల్‌ ఠాణాలో నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి..

సుధాకర్‌ మృతితో నిజామాబాద్‌లో హైటెన్షన్‌..భీమ్‌గల్‌ ఠాణాలో నిప్పంటించుకున్న వ్యక్తి చికిత్స పొందుతూ మృతి..

మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన దినేశ్‌ కులాచారి సహా పలువురు బీజేపీ నేతల అరెస్టుపోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న సుధాకర్‌ చికిత్స పొందుతూ మృతిచెందడంతో నిజామాబాద్‌ ఒక్కసారిగా అట్టుడికింది. సుధాకర్‌ మృతికి పోలీసుల వేధింపులు, అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మృతదేహానికి నివాళులర్పించేందుకు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి మార్చురీ వద్దకు చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆసుపత్రి ప్రాంగణంలో హైటెన్షన్ నెలకొంది.

సుధాకర్‌ మృతికి పోలీసుల వేధింపులే కారణమంటూ విపక్ష పార్టీలు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య ఇప్పటికే స్పష్టం చేశారు.సుధాకర్‌ భీమ్‌గల్‌ బస్టాండ్‌ వద్ద టీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు.

రాత్రి 10 గంటల తర్వాత దుకాణం నిర్వహించడం, బయట టేబుళ్లు ఏర్పాటు చేయడంపై పోలీసులు పలుమార్లు చర్యలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాజాగా కేసు నమోదు చేసి కోర్టులో జరిమానా చెల్లించాలంటూ స్టేషన్‌కు పిలిపించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధాకర్‌.. సోమవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పోలీస్‌స్టేషన్‌ ఆవరణలోనే నిప్పంటించుకున్నాడు.

అక్కడి సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు.సుధాకర్‌పై పోలీసులు పదేపదే జరిమానాలు విధించారని, ఇతర దుకాణాల విషయంలో ఇదే విధంగా వ్యవహరించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా ఎస్సై తిరుపతి వేధింపులే సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆరోపించారు. మరోవైపు సీపీ సాయిచైతన్య మాత్రం ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, సుధాకర్‌ ఆత్మహత్యాయత్నానికి మరో వివాదం కారణమై ఉండొచ్చని ఒ ప్రకటనను విడుదల చేశారు.

*మృతదేహం వద్ద రాజకీయ వేడి*

సుధాకర్‌ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మార్చురీ వద్దకు చేరుకుని సుధాకర్‌కు నివాళులర్పించారు.

సుధాకర్‌ మృతికి కాంగ్రెస్‌ నేతల ఒత్తిడి, పోలీసుల వ్యవహారశైలే కారణమంటూ వారు ఆరోపణలు చేశారు. మృతదేహానికి నివాళులర్పించే సమయంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దినేశ్‌ కులాచారి సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి 6వ టౌన్ కి తరలించినట్లు సమాచారం. దీంతో మార్చురీ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

*మార్చురీ చుట్టూ భారీ బందోబస్తు*

బీజేపీ నేతల అరెస్టుతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

ఆసుపత్రి మార్చురీ వద్దకు వచ్చే వారిని పోలీసులు తనిఖీ చేస్తుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.దీంతో సుధాకర్‌ మృతి వ్యవహారం భీమ్‌గల్‌ నుంచి జిల్లా కేంద్రానికి చేరి రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments