HomeTelanganaNizamabadనగరాభివృద్ధిపై కాంగ్రెస్‌ సర్కారు వివక్ష..స్పెషల్‌ ఫండ్స్‌, సీడీపీ నిధులేవీ.. మూడేళ్లలో అర్బన్‌కు పైసా రాలేదు.

నగరాభివృద్ధిపై కాంగ్రెస్‌ సర్కారు వివక్ష..స్పెషల్‌ ఫండ్స్‌, సీడీపీ నిధులేవీ.. మూడేళ్లలో అర్బన్‌కు పైసా రాలేదు.

బిగాల హయాంలో అభివృద్ధి జరిగిందంటూ గొప్పలు..
అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ

నిజామాబాద్‌ నగరాభివృద్ధికి నిధులు కేటాయించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ విమర్శించారు. స్పెషల్‌ ఫండ్స్‌తో పాటు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) నిధులనూ విడుదల చేయకుండా నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. మరోవైపు, గతంలో తన హయాంలోనే నగరాన్ని అభివృద్ధి చేశానంటూ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడేళ్లలో నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సీడీపీ కింద ఒక్క రూపాయి కూడా రాలేదని, ప్రత్యేక నిధులూ మంజూరు కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు లేఖలు ఇచ్చినా స్పందన లేదన్నారు. నిధుల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే 28 మంది కార్పొరేటర్లతో కలిసి అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.అలాగే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ తన హయాంలో నగరంలో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నగరంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని తాను ఏ ఒక్కరికీ ఫోన్‌ చేయలేదని, అలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. నగరానికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు, స్టేడియం నిర్మాణం, బస్టాండ్‌ సుందరీకరణ వంటి అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు.
ఖిల్లా రామాలయానికి రోప్‌వే
చారిత్రక కట్టడమైన కిల్లా రామాలయానికి రూ.35 కోట్లతో రోప్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ తయారీ ప్రక్రియ కొనసాగుతోందని, అది పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఖిల్లా రామాలయానికి రోప్‌వే, రహదారి సదుపాయాల కల్పనతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని, ఎంపీతో కలిసి సంప్రదించామని ధన్‌పాల్‌ వివరించారు.పర్వతమాల పథకం కింద సుమారు రూ.180 కోట్లతో రోప్‌వే ప్రతిపాదన ఉందని, సుమారు రూ.35 కోట్లతో రోప్‌వే ఏర్పాటు కానుందని వెల్లడించారు. ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
నిలిచిన పనులపై దృష్టి
గతంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోనీ ఫంక్షనల్‌ సమీపంలోని బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని తెలిపారు. బోధన్‌ బస్‌స్టాండ్‌ సమీపంలోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి సంబంధించి కేసులు పరిష్కారమయ్యాయని, త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందన్నారు. నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ అంశాన్ని ప్రస్తావిస్తూ.. నాగారం వద్ద 396 ఇళ్లు, ఐడీవోసీ కలెక్టరేట్‌ వెనుక మరో 250 ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. నాగారం వద్ద నిర్మాణాలు సుమారు 80 శాతం పూర్తయ్యాయని, వాటిని లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నగర ప్రాంతానికి స్థలాల కొరత ప్రధాన సమస్యగా ఉందని, అందుకే బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ ప్రతిపాదనను ముఖ్యమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.నగరంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం అవసరమని, స్థల లభ్యత సమస్యతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని ధన్‌పాల్‌ తెలిపారు. అర్బన్‌ ప్రాంతంలో స్థలం అందుబాటులో లేకపోతే రూరల్‌ పరిధిలోనైనా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. గుండారం, జాతీయ రహదారి సమీపంలో స్థలాన్ని పరిశీలించి, అందుబాటులో ఉన్న భూమికి అనుగుణంగా పాఠశాల నిర్మాణ ప్రతిపాదనను రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments