నిజామాబాద్ నగరంలోని విజయ టాకీస్ పక్కన రైల్వే బ్రిడ్జి విస్తరణ పనుల కోసం చేపట్టనున్న ట్రాఫిక్ మళ్లింపులను దీపావళి పండుగ వరకు వాయిదా వేయాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల డిమాండ్ చేశారు.
దసరా పండుగకు ముందు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తే పండుగ కొనుగోళ్ల కోసం నగరానికి వచ్చే ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.దసరా సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్లకు వస్తారని గణేశ్ బిగాల తెలిపారు.
ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందని, ఈ సమయంలో కొత్తగా మళ్లింపులు చేపడితే వాహనదారులు, చిరు వ్యాపారులు, కొనుగోళ్లకు వచ్చే కుటుంబాలకు ఇబ్బందులు తప్పవన్నారు.అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని, అయితే పండుగల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
పోలీసు, రైల్వే శాఖ అధికారులు సమన్వయంతో చర్చించి దసరా, దీపావళి పండుగలు ముగిసే వరకు ట్రాఫిక్ మళ్లింపులను వాయిదా వేయాలని కోరారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని గణేశ్ బిగాల విజ్ఞప్తి చేశారు.
