- మూడు చోట్ల ఆక్రమణల తొలగింపు..
- నడిబొడ్డున నిబంధనలకు విరుద్ధమైన భవనంపై చర్యలేవీ?
- షోకాజ్ నోటీసులకే పరిమితమా? కలెక్టర్ దృష్టి సారించాలి!
కలెక్టర్ ఆదేశాలతో నగరంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపడుతున్నారు. అయితే నగరంలో అక్రమ నిర్మాణాలు ఇంకా చాలానే ఉండగా.. కొన్నింటిపైనే అధికారులు చర్యలు తీసుకుంటూ, మరికొన్ని భారీ భవనాల జోలికి వెళ్లకపోవడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఖిల్లా ప్రాంతంలో ప్రభుత్వ భూమి చుట్టూ ఏర్పాటు చేసిన రేకుల కంచెను గురువారం తొలగించారు. అలాగే అర్సపల్లిలోని రామూర్తి చెరువు శిఖం భూమిలో ఆక్రమణను కూడా శుక్రవారం తొలగించారు. కోర్టు ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణంపైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని ఆక్రమణలు తొలగించారు.
వీటి సంగతి సరే..మరి నగర నడిబొడ్డున.. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్టాండు ఎదురుగా ఉన్న భారీ భవనం సంగతేంటి? అక్కడ మాత్రం చర్యలు ఎందుకు ముందుకు సాగడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బస్టాండు ఎదురుగా ఉన్న భవన నిర్మాణంపై గతంలోనే మున్సిపల్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అనుమతుల గడువు ముగిసినప్పటికీ నిర్మాణం కొనసాగించడం, నిబంధనలకు అనుగుణంగా సెట్బ్యాక్లు లేకపోవడం, సెల్లార్ను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారన్న అంశాలు వివాదాస్పదంగా మారాయి.
సెల్లార్తో పాటు స్టిల్ట్ ఫ్లోర్, నాలుగు పై అంతస్తులతో భవనం నిర్మించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేసి, తొలగింపు చర్యల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటివరకు పూర్తిస్థాయి చర్యలు కనిపించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన రేకుల కంచెను తొలగించడంలోనూ, చెరువు శిఖం భూమిలో ఆక్రమణను తొలగించడంలోనూ అధికారులు చొరవ చూపారు. నగరంలోని ఇతర అక్రమ నిర్మాణాలపైనా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రధాన రహదారికి ఆనుకుని, ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న భవనంపై మాత్రం చర్యల విషయంలో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
చిన్న ఆక్రమణలైనా, భారీ నిర్మాణాలైనా నిబంధనలు ఒకేలా వర్తించాలి. ఆక్రమణదారులు ఎవరైనా, నిర్మాణం ఎంత పెద్దదైనా చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందేనని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కలెక్టర్ దృష్టి సారించాలి!
నగరంలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు చర్యలు చేపడుతున్న వేళ బస్టాండు ఎదురుగా ఉన్న భవనంపై కూడా పూర్తిస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. నిర్మాణ అనుమతులు, వాటి గడువు, ఆమోదించిన ప్లాన్, క్షేత్రస్థాయిలో ఉన్న నిర్మాణం, సెట్బ్యాక్లు, సెల్లార్ వినియోగంపై సమగ్రంగా పరిశీలించాలి.
ఉల్లంఘనలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లయితే వాటిపై తీసుకున్న చర్యలను కూడా స్పష్టం చేయాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, అందరికీ ఒకే విధమైన నిబంధనలు అమలయ్యేలా చూడాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఆక్రమణల తొలగింపులో అధికారుల వేగం బస్టాండు ఎదురుగా ఉన్న భవనం విషయంలోనూ కనిపిస్తుందా? లేక నోటీసులకే పరిమితమవుతారా? అనేది వేచి చూడాలి.
