మోతాదుకు మించి రసాయనాలు కలిపి తయారు చేస్తున్న ఈ కల్లును తాగుతున్న అమాయక కూలీలు, పేదలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కల్లు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన అబ్కారీ అధికారులు వారిచ్చే ముడుపులు పుచ్చుకుని కిమ్మనడం లేదనే ఆరోపణలున్నాయి.
ఫలితంగా బాన్సువాడ ప్రాంతంలోని 13 మంది కల్తీ కల్లు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళారు.వివరాల్లోకి వెళ్లితే..బాన్సువాడ ప్రాంతంలోని బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని దుర్కి, అంకొల్, కొల్లూరు గ్రామాలకు చెందిన సుమారు 70కి పైగా మంది కల్లు తాగి వింత వింతగా వ్యవహరిస్తూ ఆస్పత్రి పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది.
కల్లు తేలేసి కొందరు, మెడను వెనక్కి వాల్చేసి పైకి లేపకుండా స్టిఫ్ గా అలాగే ఉంచి బిత్తర చూపులు చూస్తూ పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తూ కొందరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ 70 మందిలో 58 మంది బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండగా 13 మందిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
నిజామాబాద్ ప్రభుత్య ఆసుపత్రి లో చేరిన వారిలో బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని దుర్కి, అంకొల్, కొల్లూరు మూడు గ్రామాలకు చెందిన లచ్చవ్వ,లక్ష్మణ్,కాశీరాం,మోహన్, జామీర్,నరేష్,స్వామి,బాలమని,మారుతి,లక్ష్మణ్, బుజ్జి, వీరిలో పది సంవత్సరాల బాలుడైన అరవింద్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు.
ఈ 13 మంది అంతా ఒకే లక్షణాలు కలిగి ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వీరంతా దుర్కీ ప్రాంతంలోని కల్లు డిపో లో సోమవారం ఉదయం కల్లు తాగిన తరువాతే ఇలాంటి పరిస్థితి ఎదురైందని బాధితుల కుటుంబీకులు తెలిపారు.
మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రోగులను పరిశీలించి డ్యూటీలో డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. చికిత్స పొందుతూన్న 13 మంది లో 12 మంది కోలుకుంటున్నారని, ఒకరి పరిస్థితి విషమం ఉందనీ వారుకూడా త్వరలో కోలుకుంటారని తెలిపారు.
కృత్రిమంగా కల్లు తయారీ.నీళ్లలో తెల్లగా నురుగు వచ్చేలా ఓ లిక్విడ్ కలిపి కల్లులా కనపడేలా కృత్రిమ కల్లును తయారు చేస్తారు. దానిలో మత్తు కోసం డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటి నిషేధిత మత్తు పదార్థాలు కలుపుతారు.
కల్లు తాగే వారి అవసరాలను బట్టి కొంచెం మోతాదుకు మించి కూడా డైజోఫాం, ఆల్ఫ్రాజోలం వంటివి కలుపుతున్నారు. ఈత చెట్ల నుండి తీసే కల్లు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ సహజసిద్ధమైన కల్లు కాదని తెలిసినా, కృత్రిమంగా మత్తు పదార్థాలు కలిపి తయారుచేసిన కల్లు అని తెలిసినా కల్లు ప్రియులు దాన్నే ఇష్టంగా తాగుతున్నారు.
క్రమక్రమంగా కృత్రిమ కల్లుకు బానిసలుగా మారిపోతున్నారు.నాడీ వ్యవస్థ దెబ్బతింటుందిడైజోఫాం ఇతర రసాయనాలతో తయారు చేసిన కృత్రిమ కల్లును సేవించిన వారిలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది.
నీరసం, ఒంటి నొప్పులతో పాటు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. మానసిక విక్షణ కోల్పోయి పిచ్చగా ప్రవర్తిస్తుంటారు. ఈ సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాలకే ప్రమాదం.
సాధ్యమైనంత వరకు ఈ కల్లును సేవించక పోవడమే ఉత్తమం.డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
