నిజామాబాద్ డిచ్‌పల్లి మండలం కేశాపూర్ రోడ్‌లో అనుమతులు లేకుండా, నిర్మాణంలో ఉన్న ప్రమాదకర భవనంలో నిర్వహిస్తున్న నారాయణ ఇంటర్మీడియట్ కళాశాలను వెంటనే సీల్ చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవిపి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు, కళాశాలకు అనుమతులు లేవని డిఐఈఓ ఇచ్చిన నివేదికల ప్రతులను వినతిపత్రానికి జతచేసి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌కు సమర్పించినట్లు తెలిపారు.కళాశాల యాజమాన్యంతో నిజామాబాద్ డిఐఈఓ కుమ్మక్కయ్యారని కళ్యాణ్ ఆరోపించారు.
అధికారులు తనిఖీలకు వచ్చే సమయాన్ని ముందుగానే యాజమాన్యానికి తెలియజేస్తున్నారని, దీంతో విద్యార్థులను సమీపంలోని పార్కులకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, భవనంలో విద్యార్థులు లేరంటూ డిఐఈఓ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, డిఐఈఓ శాఖాపరమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులతో కలిసి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీజీవిపి జిల్లా నాయకులు అఖిల్, మహేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
