నిజామాబాద్ నగరంలోని శాస్త్రి నగర్‌లో సోమవారం నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్నారి తనవంతుగా హెల్మెట్ లు అందజేసింది. తాను ఆడుకోవడానికి, చాక్లెట్ల కోసం దాచుకున్న ‘కిట్టి బ్యాంకు’ (ముంత) డబ్బులను రోడ్డు భద్రత కోసం వెచ్చించింది.
ఆ డబ్బులతో హెల్మెట్లను కొనుగోలు చేసి, కార్యక్రమంలో పాల్గొన్న వాహనదారులకు బహుమతిగా అందజేసింది. చిన్నారి అద్విక చేసిన ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.
ఇంత చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను చాటుకోవడం గర్వకారణమని ఆయన కొనియాడారు. “ప్రాణాలు కాపాడుకోవాలనే స్పృహ పెద్దల కంటే ఈ చిన్నారిలో ఎక్కువగా ఉంది. అద్విక అందరికీ స్ఫూర్తిదాయకం” అని సీపీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సదరు బాలికను కమిషనర్ ఆత్మీయంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
