ఈ నెల 21న (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.15 గంటల వరకు జరగనున్ననీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు.
నీట్ పరీక్ష పునః నిర్వహణ ఏర్పాట్లపై శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా నీట్ పరీషను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 3456 మంది పరీక్షకు హాజరు కానున్నారని, ఈ మేరకు జిల్లా కేంద్రంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నాగారంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల/కళాశాల, బోధన్ పట్టణంలో రైల్వే గేట్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిల్డింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల బిల్డింగ్, మాక్లూర్ లోని శ్రీ బిగాల కృష్ణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక నోడల్ అధికారిని నియమించామని అన్నారు.
కాగా, అభ్యర్థులు పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి కనీసం అరగంట ముందే లోనికి చేరుకోవాల్సి ఉన్నందున, నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారని అన్నారు.
నిర్ణీత సమయం దాటిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్ష హాల్ లోనికి వెళ్లే ముందు బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీ వంటి ప్రక్రియలు చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు ముందస్తుగానే చేరుకోవాలన్నారు.
బయోమెట్రిక్ సమయంలో ఏదైనా సమస్య తలెత్తి ధృవీకరణ పూర్తి కాకపోయినా, అభ్యర్థులను పరీక్షా గదిలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారని, అయితే అభ్యర్థులు లిఖితపూర్వక హామీ పత్రాన్ని సమర్పించాలని, హామీ పత్రం నమూనా పరీక్షా కేంద్రంలో అందించబడుతుందని తెలిపారు.
అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఉపకారణాలైన మొబైల్ ఫోన్లు, డిజిటల్ చేతి గడియారాలు, బ్లూటూత్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని అన్నారు. అన్ని కేంద్రాలలో తాగునీటి వసతి, ప్రథమ చికిత్స సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలను అమర్చడం జరిగిందని, పకడ్బందీ నిఘా నడుమ సజావుగా పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నామని, కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
కాగా, నీట్ పరీక్ష రోజున రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని అదనపు డీ.సీ.పీ శుభం నగ్రాలేకు సూచించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశ్నాపత్రం, సమాధాన పత్రాల తరలింపునకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 164 (బీఎన్ఎస్) నిషేధాజ్ఞలు అమలు చేస్తూ, జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, అభ్యర్థుల సౌకర్యార్ధం పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో పరీక్షా కేంద్రాల నోడల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
