HomeLaw and Orderపీ.హెచ్.సీల ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించాలి..కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ...డొంకేశ్వర్ లో...

పీ.హెచ్.సీల ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందించాలి..కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి …డొంకేశ్వర్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్…ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియా సందర్శన

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. సాధారణ చికిత్సలతో పాటు గర్భిణీలకు స్థానికంగానే సుఖ ప్రసవాలు (కాన్పులు) కూడా చేయాలని అన్నారు.

డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, సహకార సంఘం ఎరువుల గోడౌన్, ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించారు. ముందుగా, పీ.హెచ్.సీని తనిఖీ చేసిన కలెక్టర్, ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరును పరిశీలించారు.

పీ.హెచ్.సీ తో పాటు దీని పరిధిలోని ఆరు హెల్త్ సబ్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేకరించిన బ్లడ్ శాంపిల్స్ ను డీ.హబ్ కు పంపిస్తున్న తీరును పరిశీలించారు.

వ్యాక్సినేషన్, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల అమలు, ఏ.ఎన్.సీ చెకప్ లు, గ్రామాలలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలు గురించి ఆరా తీశారు. సుశిక్షితులైన స్టాఫ్ నర్స్ ఉన్నప్పటికీ స్థానికంగా కాన్పులు ఎందుకు చేయడం లేదని కలెక్టర్ ప్రశ్నించారు.

ప్రతీ నెల కనీసం రెండు కాన్పులు స్థానికంగా జరిగేలా కృషి చేయాలని, గర్భిణీలకు స్థానిక పీ.హెచ్.సీలో డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉందని ఏ.ఎన్.ఎంలు, ఆశాల ద్వారా వివిధ సమావేశాలలో మహిళలకు అవగాహన కల్పించాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శుభాంకర్ కు సూచించారు.

నార్మల్ డెలివరీలతో పాటు, అన్ని రకాల వైద్య సేవలు పీ.హెచ్.సీల ద్వారా అందినప్పుడే ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలలో నమ్మకం పెంపొందుతుందని అన్నారు. కాగా, పీ.హెచ్.సీ పనితీరు చక్కగా ఉందని కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కలెక్టర్ జెడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, మద్యాహ్న భోజనం తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సాబేర బేగంలను ఆదేశించారు.

విద్యార్థులు ముఖ హాజరు నమోదును పరిశీలించగా, పలువురు విద్యార్థులు హాజరును ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా నమోదు చేయకపోవడాన్ని గమనించారు.

ఎం.ఈ.ఓ రామకృష్ణను ఫోన్ ద్వారా ఈ విషయమై కలెక్టర్ ప్రశ్నించారు. ఎఫ్.ఆర్.ఎస్ విధానం అమలును ఎందుకు పర్యవేక్షించడం లేదని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదైనా సాంకేతిక ఇబ్బంది ఉంటే, సంబంధిత విభాగం వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని, బహుళ ప్రయోజనాలను ఆశిస్తూ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ హాజరు విధానం నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మన ఊరు – మన బడి కింద నూతనంగా నిర్మించిన తరగతి గదుల గోడలపై పెయింటింగ్స్ వేయించాలని సూచించారు. ఇంకనూ ఏమైనా సదుపాయాలు అవసరం ఉంటే, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు అందుబాటులో ఉన్న క్రీడా పరికరాల గురించి ఆరా తీశారు.

అనంతరం కలెక్టర్ సహకార సంఘం ఎరువుల సేల్ పాయింట్ ను సందర్శించి, అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో సమీక్ష జరిపారు.

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ఏరియా సందర్శన

చిన్నయానాం శివారులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తుండడాన్ని గమనించిన కలెక్టర్, ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ డీ.ఈ రవికి సూచించారు.

బ్యాక్ వాటర్ ఏరియాలో నిలువ ఉన్న నీటిమట్టం, గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురిసి, ఎగువన గల మహారాష్ట్ర నుండి గోదావరికి వరద ప్రవాహం పెరిగిన సమయాలలో గోదావరి తీర ప్రదేశాలకు ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు.

పరీవాహక ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. బ్యాక్ వాటర్ ఏరియాను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే ప్రతిపాదనల గురించి అడిగి తెలుసుకుని, అందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments