HomeTelanganaNizamabadఅరవింద్‌.. నీ భాష మార్చుకో! మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు..

అరవింద్‌.. నీ భాష మార్చుకో! మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు..

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అరవింద్‌ రాజకీయాల్లోకి ఎలా వచ్చారో నిజామాబాద్‌ ప్రజలకు తెలుసన్నారు.

ఏళ్ల తరబడి ఏ పార్టీ జెండా మోసి, కార్యకర్తగా పనిచేసిన చరిత్ర లేకుండానే ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచారని విమర్శించారు. అప్పట్లో ధర్మపురి శ్రీనివాస్‌తో పాటు తాను రాజకీయాలకు దూరంగా ఉండటం అరవింద్‌కు కలిసొచ్చిందన్నారు. అదే పరిస్థితి లేకపోయి ఉంటే అరవింద్‌ ఎంపీ అయ్యే అవకాశమే ఉండేది కాదని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

డీఎస్‌పై ప్రజలకు ఉన్న అభిమానం, ప్రేమను ఓట్లుగా మలుచుకుని అరవింద్‌ లబ్ధి పొందారని ఆరోపించారు. గతంలో అరవింద్‌పై రాజకీయంగా ఎదురుదాడి చేయాలంటూ ఫోన్లు వచ్చిన విషయాన్ని సంజయ్‌ తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్‌లో ఏదైనా బాధ్యత ఉంటే ఆ బాధ్యతకు అనుగుణంగా పనిచేయడం మంచిదని తన తండ్రి సూచించారని తెలిపారు.

తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి అప్పట్లో సంయమనం పాటించామని.. అంతమాత్రాన తమను చేతకాని వాళ్లుగా భావించవద్దని హెచ్చరించారు. సిఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ నుంచి తనకు స్పష్టమైన ఆదేశాలు వచ్చి, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ కార్యాచరణ ఎలా ఉంటుందో నిజామాబాద్‌ ప్రజలు చూస్తారని ఆయన అన్నారు.

నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ కోసం కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నారని, అవసరమైతే రక్తం చిందించైనా పార్టీ జెండాను నిలబెట్టారని అన్నారు. ధర్మపురి అరవింద్‌ రెండుసార్లు ఎంపీగా గెలిచారని, కానీ ఆ రెండు పర్యాయాల్లో నిజామాబాద్‌ ప్రజలకు చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఎంపీగా రెండు అవకాశాలు ఇచ్చిన ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.

“అరవింద్‌ రాజకీయంగా ఎలా వచ్చారో మాకు తెలుసు.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎలా పోరాడారో కూడా మాకు తెలుసు. అధిష్ఠానం బాధ్యత అప్పగిస్తే నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ సత్తా ఏంటో చూపిస్తాం. అప్పుడు రాజకీయ ఆట ఎలా ఉంటుందో అరవింద్‌కు అర్థమవుతుంది” అని సంజయ్‌ ఘాటు హెచ్చరిక చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments