HomePOLITICAL NEWSUncategorizedఆస్తి కోసం అన్న కుటుంబంపై హత్యాయత్నం: తండ్రీకొడుకులకు 10 ఏళ్ల జైలు

ఆస్తి కోసం అన్న కుటుంబంపై హత్యాయత్నం: తండ్రీకొడుకులకు 10 ఏళ్ల జైలు

నాలుగో అదనపు జిల్లా సెషన్స్ కోర్టుఆస్తి తగాదాలు, వారసత్వ ఉద్యోగం విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారి.. అన్న కుటుంబంపైనే హత్యాయత్నానికి దారితీసింది.

ఈ కేసులో నిందితులైన తండ్రీకొడుకులకు కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.పోలీసుల వివరాల ప్రకారం…నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన నీరడి గంగాధర్, నీరడి చిన్న గంగాధర్ అన్నదమ్ములు.

వీరి తండ్రి హన్మాండ్లు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించగా, చిన్న గంగాధర్ వారసత్వంగా వీఆర్వో ఉద్యోగం పొందాడు. అయితే, ఉమ్మడి ఆస్తితో పాటు ఈ ఉద్యోగం విషయంలోనూ అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 2025, జనవరి 25న కుల పెద్దల సమక్షంలో రాజీ కుదిరింది.

అయితే, జనవరి 28న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసేందుకు చిన్న గంగాధర్ నిరాకరించి గొడవకు దిగాడు. ఆస్తి పంపకాల వల్ల తనకు నష్టం వాటిల్లుతుందనే కక్షతో, అదే రోజు సాయంత్రం చిన్న గంగాధర్ తన కుమారుడు దేవేందర్‌తో కలిసి అన్న కుటుంబంపై దాడికి తెగబడ్డాడు.

ఇనుప రాడ్లతో అన్న గంగాధర్ తలపై, భుజంపై కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అడ్డువచ్చిన వదిన లలితతో పాటు, వారి కుమారులు ప్రసాద్, శ్రీకాంత్‌లపై కూడా నిందితులు విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ కేసును విచారించిన నిజామాబాద్ నాలుగో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్.. నిందితులపై మోపబడిన నేరారోపణలు నిజమని ధ్రువీకరించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా. ఇద్దరూ కలిసి నేరానికి పాల్పడినందున సెక్షన్ 3(5) ప్రకారం మరో పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు.

ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. కేసును పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. నీరజ, నవీపేట మాజీ ఎస్సై కె. వినయ్ (ప్రస్తుతం ధర్పల్లి), కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్, సిబ్బంది రాజ్ కుమార్, చంద్రశేఖర్, గణేష్‌లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రత్యేకంగా అభినందించారు.

నేరస్తులకు శిక్ష పడటం వల్ల బాధితులకు న్యాయం చేకూరడమే కాకుండా, సమాజంలో నేరగాళ్లకు హెచ్చరికగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments