చంద్రశేఖర్ కాలనీ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగం, డ్రైవర్ అజాగ్రత్త కారణంగా నియంత్రణ కోల్పోయిన కారు..
రహదారిపై వెళ్తున్న వాహనాలను వరుసగా ఢీకొట్టడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బైపాస్ రోడ్డు వైపు నుంచి ఒక కారు చంద్రశేఖర్ కాలనీ వైపునకు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి, ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది.
ప్రమాద తీవ్రతకు బైక్‌లపై ప్రయాణిస్తున్న వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు మానవత్వంతో స్పందించారు.
తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
