నగరంలో పట్టపగలే ఓ వ్యక్తి కారును గుర్తుతెలియని దుండగుడు అపహరించుకుపోయాడు. యజమానిని నమ్మించి, కంటికి రెప్పపాటులో కారుతో సహా పరారైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు బాధితుడు నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిజామాబాద్, పుల్లోంగ్ రోడ్ ప్రాంతానికి చెందిన ఖుద్రత్ బేగ్ వృత్తిరీత్యా డ్రైవర్. ఆయన గొసియా మసీద్ (ఆటోనగర్) అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. తన స్విఫ్ట్ డిజైర్ కారు (AP 25 AF 0689) పై ఆయన జీవనోపాధి పొందుతున్నారు.
మంగళవారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో, నగరంలోని చెన్నై షాపింగ్ మాల్ సమీపంలోని కారు స్టాండ్ వద్ద ఉండగా, ఆటోలో వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి నాందేడ్ వెళ్లాలంటూ కారును కిరాయికి మాట్లాడుకున్నాడు. దీని కోసం రూ. 3,300లకు ఒప్పందం కుదుర్చుకుని, నేరుగా నాందేడ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాలని సూచించాడు.
డ్రైవర్ ఖుద్రత్ బేగ్ సదరు వ్యక్తిని కారులో ఎక్కించుకుని బయలుదేరారు. 8:20 గంటల ప్రాంతంలో గాంధీచౌక్ వద్దకు రాగానే, ఆ వ్యక్తి కారు ఆపమని చెప్పి, పక్కనే ఉన్న అరటి పండ్ల దుకాణం నుంచి పండ్లు తీసుకురావాలని డ్రైవర్‌ను కోరాడు. ప్రయాణికుడి మాట నమ్మిన డ్రైవర్ ఖుద్రత్ బేగ్ పండ్లు కొనేందుకు కారు దిగారు.
ఆయన దిగిన కొద్ది క్షణాల్లోనే, కారులో కూర్చున్న వ్యక్తి డ్రైవింగ్ సీట్లోకి మారి, కారును వేగంగా స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు కేకలు వేస్తూ పరుగెత్తినప్పటికీ, సదరు వ్యక్తి కారును ఆపకుండా వేగంగా దూసుకెళ్లి మాయమయ్యాడు.
ఈ మేరకు బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు నిందితుడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బాధితుడి నుంచి వివరాలు సేకరించారు.
సిసి కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ, కారును అపహరించిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టపగలే రద్దీగా ఉండే గాంధీచౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
