HomeHEALTHసూపరింటెండెంట్ నియామకంపై ప్రభుత్వ మీనమేషాలు..

సూపరింటెండెంట్ నియామకంపై ప్రభుత్వ మీనమేషాలు..

బదిలీల దెబ్బకు పడకేసిన అత్యాధునిక వైద్య సేవలుఒకప్పుడు పేదలకు కొండంత అండగా నిలిచి, అత్యాధునిక శస్త్ర చికిత్సలకు కేంద్రంగా విరాజిల్లిన నిజామాబాద్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, నేడు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం అనుసరిస్తున్న బదిలీల విధానంతో కుదేలైంది. పూర్తిస్థాయి సూపరింటెండెంట్ లేక పాలన గాలిలో దీపంలా మారింది.

ఆసుపత్రికి పట్టుకొమ్మలా ఉండాల్సిన సూపరింటెండెంట్ పోస్టు గత కొంతకాలంగా ఖాళీగా ఉండటం గమనార్హం. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌తోనే నెట్టుకొస్తున్న యంత్రాంగం, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతోంది.

పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. పైస్థాయి అధికారులు ఈ విషయంపై ఉలుకు పలుకు లేకుండా ఉండటం వెనుక కారణమేమిటో అర్థం కాక రోగులు ఆందోళన చెందుతున్నారు.

గతంలో ప్రభుత్వం ఒక సూపరింటెండెంట్‌ను నియమించినప్పటికీ, ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టడానికి నానా రకాలుగా మీనమేషాలు లెక్కించారు. ఉన్నతాధికారులతో తెరవెనుక మంతనాలు జరిపి, తనకు అనుకూలమైన హైదరాబాద్‌లోనే పోస్టింగ్ వేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు.

ఫలితంగా నిజామాబాద్‌ ఆసుపత్రికి గతి లేకుండా పోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మళ్లీ ఇంచార్జీ పాలన దిక్కయ్యింది. ఆ తర్వాత ఇంచార్జీ సూపరింటెండెంట్ హయాంలో ఈ ఆసుపత్రి పేదలకు వరంలా మారింది.

కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీలు, న్యూరో సర్జరీ వంటి అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలను అందుబాటులోకి తెచ్చి, కార్పొరేట్ తరహా వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించారు. అయితే, ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియ ఈ అద్భుత ప్రస్థానానికి అడ్డుకట్ట వేసింది.

సమర్థుడైన అధికారిని బదిలీ చేయడం ద్వారా ఆసుపత్రికి వెన్నెముకగా నిలిచిన పాలనా వ్యవస్థను ప్రభుత్వం ఛిద్రం చేసింది.ఇటీవల జరిగిన భారీ బదిలీల ప్రక్రియ ఈ ఆసుపత్రికి శాపంగా మారింది.

ఉన్నపళంగా సూపరింటెండెంట్‌తో పాటు 22 మంది వైద్యులను బదిలీ చేయగా, వారి స్థానంలో కేవలం 11 మంది మాత్రమే విధుల్లో చేరారు. నర్సింగ్ సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉండటంతో వైద్య సేవలు పూర్తిగా కుంటుపడ్డాయి.ప్రస్తుతం ఆ కీలకమైన సూపరింటెండెంట్ పోస్టును భర్తీ చేయకుండా, కేవలం డిప్యూటీ సూపరింటెండెంట్‌తోనే ఆసుపత్రి పాలనను నెట్టుకొస్తున్నారు.

పూర్తిస్థాయి బాధ్యతలు లేని డిప్యూటీ సూపరింటెండెంట్‌తో రోజువారీ పరిపాలన సాగించడం ఒక ఎత్తైతే, నిర్ణయాత్మక శక్తి లేక ఆసుపత్రి ప్రతిష్ట మసకబారుతోంది.అత్యవసర సేవలు కావాల్సిన రోగులు, ఇప్పుడు కనీస వైద్యం కోసం కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది.

రాజకీయ క్రీడలో పడి, ఆసుపత్రిలోని వైద్య సేవలను ప్రభుత్వం విస్మరించడంపై ప్రజలు మండిపడుతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులు చస్తుంటే, అధికారుల ఉలుకు పలుకు లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సమర్థుడైన సూపరింటెండెంట్‌ను నియమించి, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments