దేశంలో చేపట్టే జనగణన ప్రక్రియలోనే కుల గణన కూడా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణన అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని గుర్తుచేశారు.
సామాజిక న్యాయ సాధనకు కుల గణన కీలకమని భావించి.. అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని వివరించారు. వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన తప్పనిసరి అని స్పష్టం చేశారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చేపట్టిన కుల సర్వే అత్యంత విజయవంతమైందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీకి ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అనుసరించిన సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని, దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణనను తక్షణమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
