జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) స్థాపన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు.
జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామంలోని వాలాంతరీకి చెందిన 10 ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికే కేటాయించాలని, అక్కడ ప్రతిపాదించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఇతర ప్రాంతానికి మార్చాలని ఆయన సీఎంను కోరారు.
కేంద్రీయ విద్యాలయాల సంస్థ నిబంధనల ప్రకారం పాఠశాల భవన నిర్మాణానికి కనీసం 5 ఎకరాల భూమి అవసరమని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమోదించడం దురదృష్టకరమని విమర్శించారు.
ఒకే గ్రామంలో (చెల్గల్) యంగ్ ఇండియా స్కూల్ కోసం 10 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ అయిన కేంద్రీయ విద్యాలయానికి మాత్రం సరైన భూమి ఇవ్వకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రస్తుతం నర్సింగపూర్ సమీపంలో కేంద్రీయ విద్యాలయం కోసం ప్రతిపాదించిన స్థలం ఏమాత్రం అనుకూలమైనది కాదని ఎంపీ స్పష్టం చేశారు.
ఆ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం గానీ, రవాణా వసతులు గానీ లేవని పేర్కొన్నారు. పైగా సదరు స్థలం చెత్త నిల్వ చేసే డంపింగ్ యార్డ్‌కు అత్యంత సమీపంలో ఉందని, ఇలాంటి వాతావరణం విద్యాసంస్థల ఏర్పాటుకు పూర్తిగా అనర్హమని లేఖలో వివరించారు. చెల్గల్ గ్రామంలో అందుబాటులో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే కేంద్రీయ విద్యాలయం పేరిట బదలాయించాలని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేస్తే జగిత్యాల ప్రాంత విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
