HomeCRIMEనేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలకపాత్ర..దుకాణాల యజమానులు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి: సీపీ సాయి చైతన్య

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలదే కీలకపాత్ర..దుకాణాల యజమానులు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి: సీపీ సాయి చైతన్య

గ్రామాల్లో ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య అన్నారు. ‘మన ఊరు.. మన భద్రత.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా బోధన్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానమని పేర్కొన్నారు.గ్రామంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడంతో పాటు నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

ట్రాఫిక్‌ నియంత్రణ, నేరాల నివారణలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసుశాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్‌లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెగడపల్లిలో 15 కెమెరాల ఏర్పాటుకు సహకరించిన షాలిమార్‌ హేచరీస్‌ నిర్వాహకులను అభినందించారు. డ్రగ్స్‌ వినియోగం, సైబర్‌ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

2025లో నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 340 మంది మృతి చెందగా.. వారిలో 200 మంది గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.

అనంతరం విద్యార్థినులు, మహిళలు, డ్వాక్రా సంఘాల సభ్యులతో సీపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చెడు ఆకర్షణలకు లోనుకాకుండా విద్యపై దృష్టి సారించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌, బోధన్‌ రూరల్‌ సీఐ విజయ్‌బాబు, ఎస్సై రాజశేఖర్‌ గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments